దేవాలయ వివరముల
శ్రీ అన్నపూర్ణ సమేత స్వర్ణ మరకత విశ్వేశ్వరాలయము.. :
మహాగణపతి..కుమారస్వామి.. భద్రకాళి సమేత వీరభద్రుడు.. నందీశ్వరుడు మరియు ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవమ
వరంగల్.. నవంబర్ 5.6.7 తేదీలు..
***************************** చారిత్రాత్మక ఓరుగల్లు మహానగరంలో ఈనెల అనగా నవంబరు 2025./.ఐదు.. ఆరు..ఏడు..తేదీలలో శైవాగ మోక్త ప్రకారముగా పూజ్యులు మన శైవ మహాపీఠాధిపతి శ్రీ అత్తలూరి మృత్యుంజయ శర్మ గారి పవిత్ర కరకమలములతో స్వర్ణ మరకత విశ్వేశ్వరాలయ ప్రారంభోత్సవము దిగ్విజయంగా జరిగింది. ఈ దేవాలయములో శ్రీ అన్నపూర్ణాదేవి..భద్రకాళి సమేత వీరభద్ర స్వామి.. మహాగణపతి.. కుమారస్వామి.. నందీశ్వరుడు.. ధ్వజస్తంభ ప్రతిష్ట కూడా జరిగింది.
......... ఈ దేవాలయానికి ఒక విశిష్టత ఉన్నది.ఇక్కడ స్వామి వారు మరకత లింగ రూపంలో స్వర్ణాభరణాలతో
ప్రతిష్టింపబడ్డారు. ఈ మరకత లింగము కుర్తాళం పీఠాధిపతులు శ్రీ సిద్దేశ్వరానంద భారతి స్వాముల వారి అనుగ్రహంతో రాయలచెరువు శక్తిపీఠాధిశ్వరి మంత్రమహేశ్వరి శ్రీ రమ్యానంద భారతి స్వామిని వారు వరంగల్ శైవ మహాపీఠం అధ్యక్షుడు డాక్టర్ భండారు ఉమామహేశ్వరరావు ప్రార్థనపై కార్యవర్గ సభ్యులకు స్వామి వారి ఆశీస్సులతో ఉచితముగా అందజేసినారు. కలియుగంలో మరకత లింగ సేవ అత్యంత ఫలప్రదమని విశిష్టమైనదని పౌరాణికులు చాలామంది వివరించారు. ఈ ఆలయ నిర్మాణం చేసిన స్థలము రెండు దశాబ్దముల క్రితము కైలాస వాసి కొడిమెల నాగ మల్లికార్జున అయ్యవారు మరియు మన ప్రస్తుత పీఠాధిపతి శ్రీ అత్తలూరి మృత్యుంజయ శర్మ గారు దాతల వితరణతో పీఠముకై కొనుగోలు చేసినారు.ప్రస్తుత కార్యవర్గము పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ దివ్యమైన దేవాలయమును కళ్యాణమండపమును నిర్మించాలని సంకల్పించింది. అందులో ప్రముఖంగా అధ్యక్షుడు డాక్టర్ భండారు ఉమామహేశ్వరరావు..ప్రధాన కార్యదర్శి శ్రీ ముదిగొండ విశ్వనాథం.. కోశాధికారి శ్రీ కస్తుల వెంకట రామలింగేశ్వర రావు.. మరియు సహాయ కార్యదర్శి..శ్రీ శివపురం వీరభద్రయ్య దాదాపు మూడు సంవత్సరములు ఆహరహము శ్రమించి విరాళములు సేకరించి రెండు లక్షలతో ప్రారంభమైన ఈ మహా యజ్ఞాన్ని కోటి రూపాయల దివ్య దేవాలయంగా రూపొందించారు.వారికి సాంకేతిక నిర్మాణ నిపుణులు శ్రీ భండారు శివరావు గారు శ్రీ ముదిగొండ నాగేశ్వరరావు గారు ఎంతో సహకరించారు.
........దాతలుభూరి విరాళములు సమర్పించారు. సర్వ సభ్యులు తమ శక్తి కొలది కృషి చేశారు.
. ఈ దేవాలయమునకు మన పీఠాధిపతి గారు 1/5/23వ తేదీన శంకుస్థాపన చేశారు. అప్పటినుంచి ఈ నిర్మాణం నిర్విఘ్నంగా కొనసాగింది. ఈనెల అనగా.. 5వ తారీఖు..బుధవారం.. రోజున ఉదయం 8 గంటల నుంచి ఒంటి గంట వరకు
శైవ మహాపీఠ ఆస్థాన పండితులు శ్రీ ముదిగొండ అమర్నాధ శర్మ గారు.. అత్తలూరి సోమేశ్వర శర్మ.. అత్తలూరి విశ్వేశ్వర శర్మ.. విఘ్నేశ్వర పూజ. స్వస్తి పుణ్యాహవాచనం. యాగశాల ప్రవేశం. పంచగవ్య ఆసాధన.. అఖండ దీపారాధన.. అంకురారోపణ..యాగశాల ప్రవేశం ప్రారంభించి జరిపించారు.
..... సాయంత్రం నాలుగు గంటల నుంచి వాస్తు పర్యజ్ఞీకరణం.. కుండ సంస్కారం. శైవాగ్ని ప్రతిష్ట.. గణపతి హోమం.. స్థాపిత దేవతా హోమం.. జరిగాయి. విగ్రహాలకు జల క్షీర అధివాసములు జరిగినాయి.
ఆరవ తేదీ గురువారం రోజున ఉదయం 9 గంటల నుంచి ఒంటి గంట వరకు విఘ్న శ్వర పూజ.. పుణ్యాహవాచనము.. స్థాపితదేవత పూజ..మంత్ర హోమం.. విగ్రహములకు యంత్రములకు ధాన్యాధివాసం జరుపబడ్డాయి. తరువాత నీరాజనం..మంత్రపుష్పం తీర్థప్రసాద వితరణ జరిగాయి.
...... ఇక అద్భుతమైన చారిత్రాత్మకమైన పుణ్యప్రదమైన శాశ్వతమైన విగ్రహ ప్రతిష్ట ఏడవ తేదీ శుక్రవారం రోజున ఉదయం 7 గంటల నుంచి విఘ్నేశ్వర పూజతో ప్రారంభమైంది. శ్రీ యుగంధర శర్మగారు నిర్ణయించిన కార్తీక బహుళ శుక్రవారం.. విదియ.. రోహిణి నక్షత్రయుక్త మకర లగ్న సుముహూర్తమున ఉదయం 11:30 నిమిషములకు యంత్ర ప్రతిష్ట..యంత్ర.. విగ్రహ ప్రతిష్ట.. జరిగాయి. తరువాత అష్ట బంధనం న్యాసాదులు ప్రాణప్రతిష్ట.. దృక్బలి. జయాది హోమం..మహా పూర్ణాహుతి.. శాంతి కళ్యాణం జరిగాయి.
ఈ మూడు రోజులు కార్యవర్గ సభ్యులు దీక్షా వస్త్రములతో ధర్మపత్ని సమేతంగా కూర్చొని ప్రతిష్టా కార్యక్రమం ఉపాధ్యక్షుడు కాళేశ్వరం సుమన్ శర్మ పర్యవేక్షణలోశాస్త్రోక్తంగా నిర్వహించారు.
.. ఈ ప్రతిష్ట కార్యక్రమానికి హర హర శంభో హర హర శంభో అంటూ భక్తులు నినాదాలు చేసుకుంటూ తరలివచ్చారు.దేవాలయ ప్రాంగణం వయోభేదం లేకుండా శివ భక్తి సమూహంతో క్రిక్కిరిసిపోయింది. సాక్షాత్తు కైలాసమే దిగివచ్చిందా అన్నట్లు ఆహుతులు భావించారు.
స్వర్ణ విభూతి రేఖల కాంతులతో మరకత లింగము.. రజిత దీధితుల కిరీటములతో.. దివ్యా భరణముల దీప్తులతో పరివార దేవతలు.. ద్వితీయ శంభుడైన నందీశ్వరునితో.. శిఖరాయ మాయమైన ధ్వజస్తంభంతో.. ఆ దేవాలయము పరిసర ప్రాంతములు కళ కళ లాడినాయి.
ఆ మూడు రోజులు భక్తులకు ఉదయము.. మధ్యాహ్నము..అల్పాహారము..మరియు రాత్రిపూట అన్నప్రసాద వితరణ జరిగాయి. ప్రసార మాధ్యమాల ముందు పీఠాధిపతి గారు సభికులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేసినారు.
..... తరువాత దాతలకు విచ్చేసిన పెద్దలకు పెద్దలకు మరియు కార్యవర్గ సభ్యులకు సన్మాన కార్యక్రమం జరిగింది
......... చివరలో అధ్యక్షుడు ఓరుగల్లులో కాకతీయుల ముందు నుంచి వస్తూ కాకతీయుల కాలంలో స్థిరంగా కాకతీయ సామ్రాజ్య మంతట కొన్నివేల శివాలయాల నిర్మాణంతో అలరారిన శాంభవ దీక్షాపరులైన గురు శిష్య సంబంధానికి ఈనాటికి పేర్కొనదగిన వరంగల్ శ్రౌత శైవ ప్రాచుర్యాన్ని వివరించారు.
సవికులను ఉద్దేశిస్తూ దేశంలోనే ప్రప్ర ధమైన స్వర్ణ మరకత విశ్వేశ్వర దేవాలయాన్ని నిర్మించడానికి గొప్ప అవకాశం కల్పించిన సర్వ సభ్యులకు పెద్దలకు దాతలకు తపతి శ్రీ అరుణ్ కుమార్ గారికి కార్మికులకు సెలవులకు ధన్యవాదములు నమస్సులు తెలియజేశారు.
..... ఈ దేవాలయములోని మూలవిరాట్టును పరివారదేవతలను దర్శించినంతనే ఆయురారోగ్య ఐశ్వర్యములు సంకల్ప సిద్ధి తప్పక కలుగుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తూ సేవిస్తున్నారు
........ మన శరవుతసేవ దీక్షాపరులకు ఆరాధ్యులకు మహేశ్వరీ మహేశ్వరులకు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్న వారికి విదేశాలలో ఉన్న వారికి ఈ దేవాలయము ను దర్శించి పునీతులు కావలసినదిగా వరంగల్ శివ మహాపీఠం పక్షాన సద్వాణి ని వినిపిస్తున్నాను.
.. సర్వులను శివోరక్షతు మంగళమస్తు పార్వతీ పరమేశ్వరుల పరివార దేవతల కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు.
**** భండారు ఉమామహేశ్వర రావు
అధ్యక్షుడు
శ్రీ శైవ మహాపీఠం వరంగల్ శాఖ..
















Comments
Post a Comment